ఇది తెలంగాణ అబ్బాయి...రాయలసీమ అమ్మాయి ‘శాంతి’ ప్రేమకథ! రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పరిచయమైన వీరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం చేసే వీరు తల్లిదండ్రులను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. రెండు నెలలపాటు వారి సంసార జీవితం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఇంతటితో ఆగకుండా వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు కలిసుండాలని పలుమార్లు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించినా కుదరలేదు. విసిగిపోయిన భార్య తన భర్తలో మార్పు తీసుకురావాలని పోలీసులను ఆశ్రయించగా వారు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించారు.
చివరకు పశ్చాత్తాపపడిన భార్య బెయిల్‌పై వచ్చిన తన భర్తను తనకు అప్పగించాలని అత్తగారి ఇంటి ముందు ధర్నాకు దిగిన ఈ సంఘటన బషీరాబాద్ మండలం క్యాద్గీర గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల టౌన్‌కు చెందిన సుబ్బారాయుడు కుమార్తె శాంతి(21) బషీరాబాద్ మండలం క్యాద్గీర గ్రామానికి చెందిన పట్నం రాజు(25) గత సంవత్సరం జూన్ 12న ప్రేమపెళ్లి చేసుకున్నారు. పద్మశాలి కులానికి చెందిన శాంతి వడ్డెర కులానికి చెందిన రాజు ప్రేమపెళ్లిని ఇరువర్గాల తల్లిదండ్రులు అప్పట్లో ఒప్పుకోలేదు. దీంతో జూన్ 12న నిజాంపేట్ నర్సింహ్మాస్వామి దేవాలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు.
నగరంలోని జగద్గిరిగుట్టలో కాపురం పెట్టారు. రెండు నెలల తర్వాత భర్త రాజు తన అక్క నాగమ్మ మాటలు విని తనను వేధించేవాడని ఇద్దరు కలిసి కొట్టేవారని శాంతి చెబుతుంది. డబ్బులు తీసుకువస్తేనే కాపురం చేస్తానని అక్క చెప్పిన మాటలు విని వేధిస్తే కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. అయితే పోలీసులు ఇరువురిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి నా తనభర్త రాజులో మార్పు కనిపించలేదని దీంతో కేసుపెట్టానని వివరించింది. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత క్యాద్గీర గ్రామానికి వస్తే తన బావలు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా హింసించారని ఆరోపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ తన భర్త రాజు సోదరులకు మా పెళ్లి నచ్చక మమ్మల్ని విడదీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తుంది. నా భర్త రాజు అన్నదమ్ముల చెప్పుడు మాటలువిని తనను దూరం చేసుకునేందుకు పథకం రచించారని ఇందులో భాగంగానే రోజూ హింసించేవారని చెప్పింది. చివరకు సాయంత్రం సీఐ సలహా మేరకు హైదరాబాద్‌లో తన భర్తను వెతుకుతానని వెళ్లిపోయింది.
తమకు చెప్పకుండా ప్రేమపెళ్లి చేసుకున్నారు అయినా మేము ఏమి అనలేదు. వారికోసం హైదరాబాద్‌లో అద్దెకు ఇళ్లు కూడా ఇప్పించాం. రెండు నెలలు గడిచిన తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయులు వచ్చి చివరకు తమ సోదరుడు రాజును జైలుపాలు చేసింది.
‘‘రాజు శాంతి ప్రేమపెళ్లి చేసుకుని కొద్దిరోజులకు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. భర్తపై భార్య కేసు పెట్టింది. కేసు కోర్టులో ఉంది. వారు కోర్టులోనే సమస్య పరిష్కరించుకోవాలని’’ తాండూరు సీఐ రమేష్ తెలిపారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
|