క్యాడర్ పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఘోర అవమానం. సైనికులను యుద్ధానికి దింపి సైన్యాధికారులు మాత్రం రాజధానిలో కూర్చున్న నిర్లక్ష్యానికి ‘ఫలితం’ అనుభవించవలసిన అనివార్య పరిస్థితి. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలోనే డిపాజిట్లు దక్కించుకున్న విషాదకర పరిస్థితిని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పై నుంచి కింద వరకూ మితిమీరిన ఆత్మవిశ్వాసం క్రమశిక్షణారాహిత్యం సమన్వయ లోపం సమర్థ నాయకత్వం లోపించిందని ఉప ఎన్నికలు స్పష్టం చేశాయి.ఏ ఒక్క రౌండులోనూ టీడీపీ అధిక్యత కనబరచడం అటుంచి కనీసం రెండో వరసలో కూడా కనిపించకపోవడం బట్టి స్థానిక నాయకత్వాన్ని దిశానిర్దేశం చేయడంలో అగ్రనేతలు ఏ స్థాయిలో విఫలమయ్యారో స్పష్టమవుతోంది.
టీఆర్‌ఎస్ స్థానిక నాయకులతో ఉన్న మొహమాటం ఆ పార్టీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం కులం కోణం వంటి అంశాలు కలసి వెరసి టీడీపీ అభ్యర్థుల కొంప ముంచాయి. ఇక తమను బలవంతంగా రంగంలోకి దింపి పార్టీ అధినేత సహా అగ్రనేతలంతా కనిపించకుండా పోయారని అంతా కలసి తమను నట్టేట ముంచారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలయితే పార్టీ నాయకత్వం తమను అనాధగా వదిలేసిందని ఒక్క పెద్ద నాయకుడూ తమకు తోడు రాకుండా వెళ్లిపోయారని ధ్వజమెత్తుతున్నారు.
సీనియర్లు కేవలం బాబుపై ఒత్తిడి చేసి ఆయన ప్రాపకం సంపాదించేందుకు పోటీలు పడటమే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లి అభ్యర్థులను గెలిపించుకో లేకపోయారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాబ్లీపై చేసిన పోరాటాన్ని ఓట్లుగా మలచగలిగే సామర్థ్యం ఉన్న అగ్రనేతలు అవసరం లేకపోయినా బాబు వెంట ఢిల్లీకి తీసుకువెళ్లారు. వారు ప్రచారంలో దిగి ఉంటే ఫలితాలు పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేవి కాదంటున్నారు. ఎన్నికల్లో గెలవ లేకనే బాబ్లీని సాకుగా చూపిస్తున్నారన్న టీఆర్‌ఎస్-కాంగ్రెస్ విమర్శలను ఎన్నికల ఫలితాలు నిజం చేశాయి. చంద్రబాబు కూడా.. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లాలా వద్దా అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో పనిచేసే స్థానిక నేతలను కాకుం డా తన చుట్టూ ఉన్న తెలంగాణ నేతలను మాత్రమే అడగటం వల్ల ఎంత మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందో అధినేతకు అనుభవంలో గానీ రుజువుకాలేదు.
ఫలితాలపై ఎన్నిసాకులు చెప్పి తప్పించుకున్నప్పటికీ క్యాడర్ బలం ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీకి ఇవి చెంపపెట్టేనన్నది నిష్ఠురనిజం. గతంలో తన బలంతో తక్కువ మెజారిటీతో గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పుడు అంతకు మూడు- నాలుగింతల మెజారిటీని ఒంటరిగా సాధించడం తనకు డిపాజిట్లు గల్లంతవడం బట్టి.. తమ కన్నా టీఆర్‌ఎస్ బలంగా ఉందని అంగీకరించక తప్పదని ఓ మాజీ మంత్రి విశ్లేషించారు. తమ అధినేత ఇప్పటికయినా వాస్తవంలోకి వచ్చి తాను చెప్పిందే వినాలన్న సిద్ధాంతాన్ని పక్కకుపెట్టి సమర్థులయిన వారిని గుర్తించకపోతే భవిష్యత్తులో మరింత చేదు అనుభవాలు ఎదుర్కోక తప్పదంటున్నారు. జనంలో లేకుండా పార్టీ ఆఫీసు తన చుట్టూ తిరిగే వారిని పక్కకుపెట్టకపోతే నష్టం పెరిగే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:tdp,position, Political, Entertainment, Telugu
|