జగన్.. ఎవరి మాటా వినడు' -కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తున్న కొత్త స్లోగన్ ఇది! ఓదార్పు విషయంలో పార్టీ బాటలోకి తాను వెళ్లబోనని.. తన బాటలోకే పార్టీ యావత్తూ రావాలంటూ కడప ఎంపీ జగన్ అధిష్ఠానానికే సవాల్ విసురుతున్నారు. గురువారం ఇడుపులపాయలో జరిగిన వైఎస్ తొలి వర్ధంతి కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ ముందు ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఓదార్పు యాత్రను ఆపేది లేదని తేల్చిచెప్పారు. ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళులర్పించిన అనంతరం.. జగన్ ఆయన భార్య భారతి వైఎస్ సతీమణి విజయలక్ష్మిలతో మొయిలీ భేటీ అయ్యారు. అధిష్ఠానం పంపిన వర్తమానాన్ని ఆయన వారికి వివరించినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ భేటీ సందర్భంగా జగన్ తన పాత వైఖరినే పునరుద్ఘాటించారు.
పార్టీ తరఫున ఓదార్పునకు అధిష్ఠానం నిర్ణయించినందున ప్రకాశం జిల్లాలో తలపెట్టిన యాత్రను ఆపాలని మొయిలీ చేసిన సూచనను జగన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 'ఇప్పటికైనా మించి పోయింది లేదు. కాంగ్రెస్ పార్టీ అవసరం మీకుంది.. మీ అవసరం కాంగ్రెస్‌కు ఉంది. సోనియా చెప్పినట్లుగా వినండి. ఓదార్పు ఆపండి' అంటూ మొయిలీ హితవు పలగ్గా.. అందుకు జగన్ అడ్డంగా తలూపారు.
'ఓదార్పునకు కమిట్ అయ్యాను. ఓదార్పు ఆపేది లేదు' అని స్పష్టంచేశారు. పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ నేను ఎలాంటి ఇబ్బందీ కలిగించడం లేదు' అని తేల్చిచెప్పారు. 'గత ఏడాది ఇదే రోజున నా తండ్రి వైఎస్ మరణించిన పావురాలగుట్టకు సమీపంలోని నల్లకాల్వ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడాను. నాన్న కోసం ఆత్మ బలిదానానికి పాల్పడిన ఆత్మ బంధువుల ఇళ్లకు వెళ్లి ఓదార్పునిస్తానని ప్రకటించాను.
ఓదార్పు యాత్రలో ఇప్పటికే చాలా దూరం వెళ్లాను. ఈ సమయంలో వెనక్కు తిరిగి రావడం నా వల్ల కాదు. మాట తప్పడం.. మడమ తిప్పడం మా ఇంటా వంటా లేదు. శుక్రవారం నుంచి ఓదార్పు యాత్ర చేసి తీరతాను. ఈ యాత్రలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నేతలు పాల్గొంటే మంచిది. ఓదార్పు యాత్ర వల్ల పార్టీకి ప్రయోజనమే' అని జగన్ స్పష్టంచేశారు. యాత్ర విషయంలో మరో మాట లేదని నిష్కర్షగా చెప్పారు.
అంతకైతే పార్టీతో కలిసి ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయాన్ని తర్వాత ఆలోచిస్తానని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు తన కోసం ఎదురుచూస్తున్నారని వారిని నిరాశపరచలేననీ కూడా ఆయన పేర్కొన్నారు. తర్వాత కేవీపీని కూడా వారు భేటీ అయిన గదిలోకి పిలిపించి మంతనాలు సాగించినా.. జగన్ వైఖరిలో మార్పు లేకపోవడంతో.. చేసేదేమీ లేక మొయిలీ బయటకు వచ్చేశారు.
అక్కడే ఉన్న రాజ్యసభ సభ్యుడొకరు మొయిలీని పలకరించినప్పుడు.. 'నేను నిస్సహాయుడిని' అంటూ నిట్టూర్పు విడిచారు. తన చేతుల్లో ఏమీ లేదని.. అంతా దాటిపోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం కేవీపీతో కలసి మొయిలీ హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద జగన్‌ను మొయిలీ గట్టిగా ఆలింగనం చేసుకున్నారు.
మొత్తంమీద జగన్‌కు ఆఖరి అవకాశంగా పార్టీ అధిష్ఠానం మొయిలీ ద్వారా చేసిన రాయబారం ఫలించలేదని తేలిపోయింది. జగన్ చెప్పిన విషయాలను మొయిలీ గురువారమే పార్టీ సీనియర్ నేతలకు తెలియజేశారు. దాంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో ఓదార్పు ప్రారంభించే పక్షంలో.. ఇక జగన్‌పై చర్య తీసుకోక తప్పదని వారు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
యాత్ర ప్రారంభించాక ఏ క్షణంలోనైనా ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొయిలీ ఇచ్చిన సమాచారం ఆధారంగా పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనపై చర్య తీసుకుంటుందని పార్టీ వర్గాలు వివరించాయి.నేతలపై జగన్ వర్గం ఒత్తిడి: ఓవైపు జగన్ విషయంలో అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారిన ప్రస్తుత తరుణంలో.. జగన్ వర్గం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనంటూనే.. ప్రకాశం నెల్లూరు నేతలను యాత్రకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తాము చేపట్టే ఓదార్పు యాత్ర వల్ల తమ కంటే పార్టీకే లాభమన్న కొత్త రాగాలాపనను ఆ వర్గం చేస్తోంది. ఇప్పటివరకు యాత్ర జరిగిన జిల్లాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నా అధిష్ఠానం ఎవరిపైనా చర్య తీసుకోలేదని.. ఇక ముందు కూడా తీసుకోబోదని ఆ రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులకు జగన్ వర్గం స్పష్టంచేస్తోంది. తూర్పు గోదావరిలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పలువురు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అధిష్ఠానం వద్దంటున్నా ఓదార్పులో పాల్గొన్నారని.. అలాగే ప్రకాశంలో తాను పాల్గొంటానని మంత్రి బాలినేని బహిరంగంగా వ్యాఖ్యానించినా ఎలాంటి చర్యలు లేవంటూ నేతలకు జగన్ వర్గీయులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీపై ప్రభావం చూపగలిగే బలమున్న తమను ఎవరూ ఏం చేయలేరన్న ధీమా వారిలో కనిపిస్తుండటం విశేషం. ఇందుకు గడ్డిపోచ.. ఏనుగు కథను వారు ఉదహరిస్తున్నారు. గడ్డిపోచలన్నిటినీ కలిపి తాడుగా చేస్తే ఏనుగునైనా బంధించవచ్చన్నట్లుగానే.. ప్రజాప్రతినిధులంతా ఒక్కటైతే అధిష్ఠానం దిగిరాక తప్పదన్న కొత్త సూత్రీకరణను చేస్తున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, evari, mata, vinadu, Political, Entertainment, Telugu
|