ముఖ్యమంత్రి కె రోశయ్య అనారోగ్యం నుండి పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మంగళవారం సాయంత్రం రక్తపోటు మధుమేహ స్థాయి ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిమ్స్ వైద్యులు హుటాహుటిన ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అదేసమయంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ముఖ్యమంత్రి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని ఆయనను నిమ్స్‌కు తరలిస్తున్నారంటూ వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ముఖ్యమంత్రిని పరీక్షించిన నిమ్స్ వైద్యబృందం ఈ వార్తలను ఖండించింది. నిమ్స్ డైరక్టర్ డాక్టర్ డి ప్రసాద్‌రావు సిఎం నివాసగృహం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన ధృవీకరించారు. ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని మధుమేహ స్థాయి పెరగడం మినహా ఎటువంటి సమస్యలూ లేవని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిరోజూ ముఖ్యమంత్రికి ఉదయం సాయంత్రం తాము ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రస్తుతం అదే పని చేస్తున్నామని చెప్పారు. వైద్య పరీక్షల్లో ఎటువంటి ప్రత్యేకతలూ లేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రిని నిమ్స్‌కు తరలించాల్సిన అవసరం లేదన్నారు. గత నెల 31 నుండి సిఎం అనారోగ్యానికి గురి అయిన విషయం తెలిసిందే. ఆయనకు వైరల్‌ఫీవర్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అప్పటినుండి ఆయన దాదాపుగా అధికారిక కార్యక్రమాలక దూరంగానే ఉంటున్నారు. తన నివాసగృహంనుండే ముఖ్యమైన ఫైళ్ళను పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. మంగళవారం కూడా ఆయన సచివాలయానికి రాలేదు. అయితే ఇంటివద్దే ఆరోగ్యశ్రీ పథకంపైన సమీక్షించారని నిమ్స్ పాలకవర్గ సమావేశానికి అధ్యక్షత వహించారని రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారని సిఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:cm, health, condition, Political, Entertainment, Telugu
|