సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పట్టుబడ్డ భాను సిఐడి పోలీసులు విచారించిన కేవలం పది గంటల వ్యవధిలోనే పలు కీలక విషయాలు వెల్లడించారు. నేరాంగీకార పత్రంలో వెల్లడించిన విషయాలను సిఐడి పోలీసులు సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. సూరి జైలులో ఉన్న సమయంలో అతని ఆస్తులకు బినామీగా వ్యవహరించిన భాను సొంతంగా సెటిల్‌మెంట్లు చేసి వందల కోట్ల రూపాయలను కూడబెట్టుకున్నాడు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతోపాటు నగర శివారులోని రాయదుర్గం నార్సింగి మియాపూర్ కూకట్‌పల్లిలతోపాటు సమీపంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన మరికొన్ని ప్రాంతాల్లో సెటిల్‌మెంట్లకు పాల్పడ్డాడు. ఒక మంత్రి నుంచి ప్రభుత్వ భూములకు చెందిన సమాచారాన్ని సేకరించి ఇద్దరు ఆర్డీవోలు ఒక సబ్‌కలెక్టర్ ద్వారా క్లియరెన్స్ తీసుకున్నాడు. అందుకు ప్రతిగా వారికి పెద్దమొత్తంలో నజరానా చెల్లించడంతోపాటు వారి కోరిక మేరకు ప్రముఖ హీరోయిన్‌లను వారి వద్దకు పంపించినట్టు కూడా భాను అంగీకరించాడు. వివాదాలు కోర్డు గొడవల్లో ఉన్న స్థలాలను కూడా ఇదేవిధంగా పరిష్కరించుకుని ఆక్రమించుకున్నాడు. కడప జిల్లాల్లో ఉన్న తన ఆస్తులకు బినామీని ఏర్పాటు చేసుకున్నాడు. నగర శివారులో భూ సెటిల్‌మెట్లకు సంబంధించి స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నాడు.
తన ఆస్తులకు సంబంధించి పన్నులు సైతం చెల్లించినట్టు భాను అంగీకరించాడు. జైలు నుండి విడుదలైన తరువాత విషయం తెలుసుకున్న సూరి ఆస్తులను తిరిగి ఇవ్వాల్సిందిగా వత్తిడి తీసుకురాసాగాడు. ఈ క్రమంలోనే సూరితో తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన భాను అతన్ని అంతం చేయాలని నిర్ణయించాడు. హత్యకు రెండు నెలల ముందు నుండె రెక్కీ నిర్వహించాడు. తన వద్ద ఉన్న పిస్టల్‌తో రిహార్సిల్స్ చేసిన సమయంలో అది సరిగా పేలకపోవడంతో మన్మోహన్ సహకారం తీసుకున్నాడు. మన్మోహన్‌కు చెందిన గన్‌ను తీసుకున్న భాను 2011 జనవరి 3వ తేదీన అవకాశం చిక్కడంతో హతమార్చాడు. సూరి హత్య తరువాత రాష్ట్రం వదిలి వెళ్లిన భాను ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో యునినార్ సంస్థకు చెందిన సిమ్‌కార్డును నకిలీ పేరుతో తీసుకుని దాని సహాయంతో ఇక్కడ ఉన్న తన అనుచరులకు వందల సంఖ్యలో ఫోన్‌లు చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాడు. భాను పట్టుబడిన తర్వాత కేవలం పది గంటలు మాత్రమే విచారించిన సిఐడి పోలీసులు పై విషయాలను రాబట్టారు. కేసు దర్యాప్తుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి అనుమతించాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:bhanu, reveals, secrets, to, cid, Political, Entertainment, Telugu
|