రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు మొదటినుంచి అండగా నిలుస్తున్న సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న ‘రెడ్డి’ కులస్థులు జగన్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెప్పారు. ఇపుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న ‘కమ్మ’ సామాజిక వర్గంపై జగన్ దృష్టి పెట్టారు. విజయవాడ అర్బన్ టిడిపి అధ్యక్షుడు వల్లభనేని వంశీ జగన్‌ల కలయిక యాధృచ్ఛికమే అని చెబుతున్నప్పటికీ ఇది వూహాత్మకంగా జరిగిందేనని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. వంశీ సంఘటన నుంచి టిడిపి నాయకత్వం తేరుకోకముందే ఆదివారం ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుతో జగన్ భేటీ అయ్యారు. కాపు కులస్తుల్లో మంచి పేరున్న దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కోస్తా ప్రాంతంలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని జగన్ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పలుకుబడి ఉన్న ప్రధాన కులాలను తనవైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ టిడిపి నాయకత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
తమకు అండగా నిలుస్తున్న సామాజిక వర్గానికి చెందిన వారు సైతం జగన్ వైపు వెళ్తూడటం టిడిపి నాయకత్వానికి మింగుడు పడటం లేదు. నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌లకు సన్నిహితంగా ఉండే వల్లభనేని వంశీ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్‌కు చేరువవుతున్నారన్న వార్తల్ని టిడిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. విజయవాడలో వల్లభనేని వంశీ జగన్మోహన్‌రెడ్డిని కలవడం యాధృచ్చికంగా జరిగిన సంఘటన కాదని టిడిపి నేతలు భావిస్తున్నారు. వంశీ సంఘటన నుంచి పార్టీ ఇంకా తేరుకోక ముందే ఆదివారం టిడిపి మాజీ ఎంపి సినీనటుడు మోహన్‌బాబు ఇంటికి ఆదివారం జగన్మోహన్‌రెడ్డి వెళ్లారు. మంచు విష్ణు దంపతుల పిల్లలను చూసేందుకు జగన్ దంపతులు వచ్చారని ఇది రాజకీయ సమావేశం కాదని మోహన్‌బాబు ప్రకటించగా ఈ కలయికపై జగన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తన రాజకీయ రంగ ప్రవేశంపై త్వరలోనే ప్రకటించనున్నానని మోహన్‌బాబు చెప్పడం ఆయన జన్మదిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొనడంతో మోహన్‌బాబు మళ్ళీ టిడిపిలో చేరనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ వ్యూహాత్మకంగానే మోహన్‌బాబు నివాసానికి వెళ్ళినట్టు భావిస్తున్నారు. మోహన్‌బాబు కోడలు జగన్‌కు సోదరి అవుతారు. ఆమెకు ఇటీవల అమెరికాలో కవల పిల్లలు పుట్టారు. వారిని చూసేందుకు జగన్ దంపతులు మోహన్‌బాబు నివాసానికి వెళ్ళిన సందర్భంగా వారిద్దరూ రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టు తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా మోహన్‌బాబును జగన్ ఆహ్వానించినట్టు సమాచారం.
వంశీ మోహన్‌బాబులతో జగన్ కలిసిన సంఘటనలు యాధృచ్చికంగా జరుగుతున్నవి కావని తమ పార్టీకి అండగా నిలిచే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడానికి జగన్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. బాబు నాయకత్వంలో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా ఏర్పడితే టిడిపి సామాజిక వర్గం నుంచి సైతం పెద్ద ఎత్తున జగన్ పార్టీలోకి వలసలు పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు జగన్‌తో మంతనాలు సాగిస్తున్నారని పార్టీ నేతల అనుమానం. టిడిపి అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి అల్లుడు కుమార్తె ఇప్పటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. సొంత సామాజిక వర్గంలోనే విశ్వాసం సన్నగిల్లితే అది పార్టీకి చాలా నష్టం కలిగిస్తుందని టిడిపికి చెందిన మాజీ మంత్రి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, caste, politics, Political, Entertainment, Telugu
|