నెల్లూరు లోక్‌సభ పద్దెనిమిది శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో అత్యధిక స్థానాలను జగన్ నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోనున్నదని కాంగ్రెస్ నాయకుడు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలియజేశారు. జగన్ పార్టీకి 14 నుండి 16 స్థానాల వరకూ రావచ్చునని అంటూనే కాంగ్రెస్ పార్టీ ఒకటి నుండి మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు రెండు స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని వరంగల్ జిల్లా పరకాల స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకోవడం ఖాయమని ఆయన చెప్పారు. ఉపఎన్నికల పోలింగ్ సరళిని మంగళవారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన పత్రికా గోష్ఠిలో విశ్లేషించిన ఆయన ఎన్నికల ప్రచారం మధ్యలో జగన్‌ను సిబిఐ అరెస్టు చేయడం ఆయన తల్లి విజయమ్మ కన్నీటితో కొనసాగించిన ఎన్నికల ప్రచారం వల్ల వోటర్లలో సానుభూతి వెల్లువ పెల్లుబికిందని ఆయన అంగీకరించారు. అవినీతి అక్రమాస్తుల కేసులో జగన్‌ను అరెస్టు చేయడంలో జరిగిన ఆలస్యం జగన్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జరిగిన జాప్యం ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కల్గించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వైఎస్ తనయుడని కాంగ్రెస్ అధిష్టానం చాలాకాలం సంయమనంతో వ్యవహరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళంలో పడిన మాట వాస్తవమేనని అయితే ఉపఎన్నికల ప్రచారం ఊపందుకున్న తర్వాత వారంతా త్వరగానే కోలుకొని జగన్ సాగిస్తున్న అబద్ధపు ప్రచారాన్ని అక్రమాలను గట్టిగానే ఎండగట్టారని పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఐక్యంగా నిలిచి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని లగడపాటి కితాబు ఇచ్చారు. తన కుటుంబానికి అన్యాయం జరుగుతోందంటూ వోటర్లను ఆకట్టుకోవడంలో విజయమ్మ సఫలీకృతం కావడంతో గెలవలేకపోయినా ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వోట్ల శాతం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వోట్లు సీట్లు లభిస్తాయని జోస్యం చెప్పారు. జగన్ పార్టీ పుట్టుకే అబద్ధాలతో పుట్టిందన్న రాజగోపాల్ ఎన్నికల కమీషన్ వద్ద యువజనశ్రామిక రైతు కాంగ్రెస్ పేరుతో పార్టీని నమోదు చేసిన ఆయన ప్రజలకు మాత్రం వైఎస్‌ఆర్ అంటే వై.ఎస్.రాజశేఖర పార్టీ అని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. జగన్ అబద్ధాలకోరు అని ప్రజలు ఇప్పుడిప్పుడే మెల్లగా గ్రహిస్తున్నారని ఈ ఉపఎన్నికలలో గెలిచినా ఆ పార్టీకి ఎలాంటి భవిష్యత్తు లేదంటూ చంద్రబాబు నాయుడు అబద్ధాలకోరని అర్థం చేసుకున్నందునే ప్రజలు ఆయన పార్టీని రెండుసార్లు వోడించారని అన్నారు. ఇకముందు జగన్ పార్టీకి కూడా ఇకముందు అదే గతిపడుతుందని చెప్పారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:lagadpati, survey, Political, Entertainment, Telugu
|