చెన్నయ్‌లోని ఓ నైట్‌పార్టీలో తమిళ నటుడు మహత్‌పై ప్రముఖ నటుడు మంచు మనోజ్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలపై నటి తాప్సీ స్పందించింది. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రకటన విడుదల చేసింది. తన వల్లనే వారిద్దరూ గొడవపడినట్లు తమిళ మీడియాలో వచ్చిన వార్తలను తాప్సీ ఖండించింది. మనోజ్ తనకు సోదరుడిలాంటివాడని మహత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తాప్సీ తేల్చిచెప్పింది. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరును దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ ప్రకటన సారాంశం... "ఆ గొడవ జరిగినప్పుడు నేను కర్నూల్‌లో వున్నాను. తరువాతే నాకూ తెలిసింది. గొడవకి నేను కారణమంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుండి మోహన్‌బాబు లక్ష్మీ విష్ణు మనోజ్‌లు నాకు తెలుసు. నేను ఈ రోజు ఈ స్థాయిలో వున్నానంటే అందుకు వారే కారణం. నన్ను కుటుంబ సభ్యురాలిగానే ఆదరించారు. అందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడి వుంటాను. మోహన్‌బాబు అంకుల్ నన్ను కూతురిలా చూసుకుంటే లక్ష్మీ విష్ణు మనోజ్‌లు నన్ను చెల్లెలుగా ఆదరిస్తారు. అటువంటిది మనోజ్‌కి నాకు లింకులు పెట్టడం చాలా చీప్‌గా వుంది.
ఇంతకుముందు కూడా నన్ను నా పేరుని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించిన వారి నుండి నన్ను రక్షించింది మోహన్‌బాబు కుటుంబమే. నా వరకూ గౌరవప్రదంగా బతకాలని భావిస్తాను. అందుకే నా పేరుని ఉపయోగించుకుని ప్రాచుర్యం పొందాలనుకున్న వారి జోలికి కూడా వెళ్లకుండా దూరంగా వుంటున్నాను. నాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు.
ఇంతకుముందు వదంతులు వచ్చినప్పుడూ ఇదే చెప్పాను. కానీ ఇప్పుడవి శృతిమించాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను ఈ గొడవలోకి లాగడానికి ఎవరికీ హక్కు లేదు. మహత్ గురించి చెప్పేది చేసేది ఏమీ లేదు. ఇదొక విషాదకర ఘటనగా మరచిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. నా పేరుని స్వార్థం కోసం ఉపయోగించుకోవద్దు. కష్టపడి సాధించుకున్న పేరుని గౌరవాన్ని దయచేసి పాడుచేయద్దు.''
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:manoj, is, like, my, brother, tapsi, Political, Entertainment, Telugu
|